విశాఖ సాగర తీరంలో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్న
నీటిలో తేలియాడే వంతెన(ఫ్లోటింగ్ బ్రిడ్జ్)ను జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున పరిశీలించారు. విక్టరీ ఎట్ సీకి సమీపంలో
బీచ్ వైపు ఏర్పాటు చేస్తున్న వంతెనను జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, వీఎంఆర్డీఏ, పోలీసు
అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. అధికారులు, నిర్వాహకులతో కలిసి కాసేపు బ్రిడ్జిపై నడిచి
వెళ్లారు. విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జికి అదనపు సొబగులు
తీర్చిదిద్దాలని, భద్రతాపరమైన చర్యలు పటిష్టంగా చేపట్టాలని అధికారులకు, నిర్వాహకులకు సూచించారు. అలల
తాకిడికి పర్యాటకులు ఇబ్బంది పడకుండా వంతెనకు అటూ ఇటూ గట్టిగా బలమైన రోప్ లు ఏర్పాటు చేయాలన్నారు.
బీచ్ నుంచి సుమారు 100 మీటర్ల మేర సముద్రంలోకి వేసిన వంతెనపై నడిచి వెళ్లిన ఆయన ఒక కొత్త అనుభూతిని
పొందినట్లు చెప్పారు. చాలా ఇంటరెస్టింగ్ గా ఉందని అభిప్రాయపడ్డారు. చూడడానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా
ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. గజ ఈతగాళ్లు వంతెనపై నిత్యం ఉండేలా చూడాలని,
వంతెనకు రెండు వైపులా లైఫ్ బోట్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు
తప్పకుండా తీసుకోవాలని, నిబంధనల మేరకు కార్యకలాపాలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అన్ని రకాల
సాంకేతిక ప్రక్రియలు పూర్తైన వెంటనే కార్యకలాపాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం
చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తొలి ప్రాజెక్టు
ఇలా నీటిపై తేలియాడే వంతెన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే మొదటిదని శ్రీసాయి మోక్ష షిప్పింగ్ & లాజిస్టిక్స్ ప్రతినిధి
సుదర్శన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.1 కోటి వరకు అవుతుందని చెప్పారు. వీఎంఆర్డీఏ అధికారులతో
కలిసి కేరళ వెళ్లామని అక్కడ నిర్వహిస్తున్న ఇలాంటి వంతెనలను పరిశీలించామని వివరించారు. అక్కడ
వినియోగించిన మెటీరియల్, సాంకేతిక సహాయాన్ని వినియోగించి ఇక్కడ వంతెన ఏర్పాటు చేస్తున్నామని
పేర్కొన్నారు. పర్యాటలకు రక్షణ కొరకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని, పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ
సందర్భంగా ఆయన చెప్పారు. వంతెన బీచ్ నుంచి 100 అడుగుల మేర సముద్రంలోకి ఉంటుందని, చివరి భాగంలో
సముద్రపు లోతు 6-8 అడుగులు ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు
తీసుకుంటున్నామని వివరించారు. వంతెన ఇలా నీటిపై తేలియాడి ఉండేందుకు అనువుగా ఇప్పటికే సిమెంటుతో
తయారు చేసిన యాంకర్లు 34, ఇనుముతో తయారు చేసిన మరొక రెండింటిని వినియోగించామని తెలిపారు. ఈ
వంతెన ఒక్కసారి 200 మంది వెళ్లే సామర్థ్యం కలిగిన ఉంటుందని స్పష్టం చేశారు. వంతెనపై ప్రతి 25 మీటర్లకు ఒక గజ
ఈతగాడు ఉండటంతో పాటు పర్యాటకుల వెంట మరొక ముగ్గురు గజ ఈతగాళ్లు ఉంటూ పర్యవేక్షిస్తారన్నారు.
వంతెనకు రెండు వైపులా రెండు లైఫ్ బోట్లను నిత్యం అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అధికారిక
అనుమతులు వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు.