గంజాయి అక్రమ రవాణా మరియు మత్తు పదార్థాలు వాడేవారిపై కఠిన నిఘా కొనసాగించాలని సూచించారు విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి.
గంజాయి రవాణా మార్గాలపై ఆకస్మిక తనిఖీలు జరపాలని, మత్తు పదార్థాలు వాడేవారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు డీ-అడిక్షన్ సెంటర్లకు ప్రోత్సహించాలన్నారు.
రౌడీషీటర్లు, చెడు నడత కలిగిన వారిపై తరచూ కౌన్సిలింగ్ నిర్వహించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.
గ్రామ స్థాయిలో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించి, ప్రజలు బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం పంచుకోకుండా జాగ్రత్త పడేలా చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కఠినంగా అమలు చేయాలని సూచించారు.
మహిళా రక్షణ చట్టాలు, ఫోక్సో ఆక్ట్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ అంశాలపై అవగాహన కల్పించి, ప్రతి మహిళకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
శక్తి యాప్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, దాని వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణలో సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి వాటిని ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
అనంతరం సిబ్బందితో సమావేశమైన డీఐజీ గారు, నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, ప్రజలతో సత్సంబంధాలు కలిగి నేర నిరోధక చర్యల్లో చురుకుగా ఉండాలని సూచించారు. సిబ్బంది సమస్యలను ప్రత్యక్షంగా విని, పరిష్కారానికి హామీ ఇచ్చారు.
ఈ తనిఖీలో రేంజ్ డీఐజీ గారితో పాటు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్, సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పి.శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్.రేవతమ్మ, ఎస్సై పి.రాజారావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.