తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ పిలిప్ బ్రౌన్ నవంబర్ 10 వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఆంధ్ర విశ్వ కళాపరిషత్ తెలుగు శాఖలో బ్రౌన్ గారి 227వ జయంతి జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎ...నరసింహ రావు , తెలుగు శాఖాధిపతి
జర్రా అప్పారావు సిపి బ్రౌన్ చిత్రపటాన్ని పూల మాలతో అలకరించారు.ఈ సభకు అధ్యక్షత వహించిన ఆంధ్ర విశ్వ కళాపరిషత్ తెలుగు శాఖాధిపతి జర్రా అప్పారావు మాట్లాడుతూ, కారుమేఘాలలో మెరుపులాంటి మహానీయుడు సిపి బ్రౌన్.
మనుచరిత్ర,..వసుచరిత్ర,భారతం,దశావతార చరిత్ర మొదలైన ఎన్నో గ్రంథాలను సేకరించి పరిష్కరించిన సాహితీ మూర్తి సిపి బ్రౌన్.
పేదల పెన్నిధి బ్రౌన్.ఉచిత భోజన సౌకర్యంతో పాఠశాలను ఏర్పాటు చేసిన మానవతావాది.రెండు వేల వేమన పద్యాలు సేకరించి సమాజానికి అందించిన మహోన్నత మూర్తి బ్రౌన్ అని శాఖాధిపతి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపాల్
ఆచార్య ఎ.నరసింహ రావు మాట్లాడుతూ తెలుగు భాషకు ఆయన చేసిన సేవ అద్భుతం, అనన్య సామాన్యం.
పేదలకు ఉచిత విద్య భోజన వసతి కల్పించిన ఆదర్శమూర్తి
బ్రౌన్ అని చెప్పారు.అరసం ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు మాట్లాడుతూ తెలుగు భాషకు సిపి బ్రౌన్ చేసిన సేవలను గూర్చి వివరించి ఒక కవిత కూడా రాసి వినిపించారు.ఎన్నో తెలుగు గ్రంథాలను ఆంగ్లంలో అనువదించాడు అని పేర్కొన్నారు.సిపి బ్రౌన్ జన్మదినాన్ని తెలుగు పండుగలా జరుపుకోవాలి అని సూచించారు.
ఆచార్య గజ్జా యోహాను బాబు మాట్లాడుతూ ఒక ఆంగ్లేయుడు తెలుగు భాషకు కృషి చేయటం చెప్పుకోదగ్గ విషయం. నిరంతర నిర్విరామంగా తెలుగు భాషకు కృషి చేసిన సాహితీ మూర్తి అని అన్నారు. డాక్టర్ దామెర వెంకట సూర్య రావు మాట్లాడుతూ
19వ శతాబ్దం తెలుగువారి సాంస్కృతిక జీవనంలో తెలుగు భాష సాహిత్య వికాసంలో చార్లెస్ పిలిప్ బ్రౌన్ అనే ఆంగ్లేయుడు కృషి చిరస్మరణీయం. మన భాషని, మన సంస్కృతిని, మన సాహిత్యాన్ని,మనమే సరైన దృష్టితో పట్టించుకోని రోజుల్లో మరో దేశం మరో మాతృభాష కలిగిన వాడు ఈ దేశ భాషల మీద ఎంతో ప్రేమతో మన తెలుగు నేర్చుకుని సేవ చేయటం మరువలేనిది అని తెలియజేశారు.
ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలో ప్రచండ భాస్కరుడు సిపి బ్రౌన్. తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని గౌరవ స్థానాన్ని తెచ్చిన సాహితీ ఆరాధకుడు సి పి బ్రౌన్.అమూల్యమైన తాళపత్ర గ్రంథాల సేకరణలోను, సంస్కరణలలోను పరిష్కరణలోను, ముద్రణలోను వ్యాకరణ రచనలోను నిఘంటు నిర్మాణములోను, లఘు రచనలు రాయడంలోను, వ్యాసాలు రాయడంలోను, తెలుగు వాచకం రాయడంలోను,లేఖలు రాయడంలోను, తెలుగువారికి ఆదర్శప్రాయుడు సిపి బ్రౌన్ అని ఆచార్య సిమ్మన్న అన్నారు.1825 నాటికి తెలుగు సాహిత్యంలో జీవం లేదు.30 సంవత్సరాలలో తెలుగు భాషా సాహిత్యాలకు కృషిచేసి దాన్ని సజీవం చేశాను అని ఘంటాపదంగా చెప్పిన పరిశోధక పరమేశ్వరుడు సిపి బ్రౌన్.వీరు లేకపోతే ప్రజా కవి వేమన మనకు లేడు అని సిమ్మన్న తన అభిప్రాయం చెప్పుకున్నారు.లండన్ విశ్వవిద్యాలయంలో గౌరవ తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు.బ్రౌన్ ఆంగ్లేయుడైనా పుట్టింది ఇండియాలోనే.తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన సాహితీ మూర్తి ,సాహిత్య సంరక్షకుడు,ప్రాతఃస్మరణీయుడు అని సిమ్మన్న కొనియాడారు. బ్రౌన్ జయంతి ప్రభుత్వం కూడా చేయడానికి ముందుకు రావడం ఆనందదాయకం అని సిమ్మన్న ప్రభుత్వాన్ని అభినందించాడు.