హోటల్ మేఘాలయలో జరిగిన రోజా అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె పద్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం డాబా గార్డెన్స్, ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మార్చి 6న రోజా హోటల్ గదిలో చనిపోతే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన మూడో పట్టణ పోలీస్ పోలీసులు మీడియాకి తెలియపరచకపోవడం ఆశ్చర్యం, అనుమానాస్పదంగా ఉందన్నారు. హోటల్ గదిలోని డాక్టర్ శ్రీధర్ ఎవరని, ఆమె అతని రూమ్ కి ఎందుకు వచ్చిందని, రోజా మృతి చెందినప్పుడు హోటల్ రూములోనే అతను ఉండగా పోలీసులు హోటల్ మేనేజర్ నుంచి కంప్లైంట్ ఎందుకు
తీసుకున్నారని అడిగారు.
మృతికి కారణాలు తెలియకుండానే ఎఫ్ఐఆర్ లో నో ఎక్యూజ్డ్ అని ఎలా రాసారని, మరి ఏసీపీ లక్షణమూర్తి అనుమానాస్పద మృతని ఎలా చెప్పారన్నారు.
ఎఫ్ఐఆర్లో అనుమానాస్పద మృతిగా బి ఎన్ ఎస్ ఎస్194 గా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన జరిగిన సమయంలో ఘటనా స్థలంలోనే ఉన్న డాక్టర్ శ్రీధర్ ని ఎందుకు అనుమానించలేదని ఆమె నిలదీశారు. అతని ఫోన్ ని, రోజా ఫోన్ ని సీజ్ చేస్తే మృతికి గల కారణాలు తెలిసేవని, ఆ ఫోన్లను పోలీసులే దాచేసారా అని అనుమానం వ్యక్తం చేశారు.
ఏ మహిళ అయినా నగ్నంగా మారి ఆత్మహత్య చేసుకుంటుందా అంటూ,
ఉన్నత వర్గాలకు చెందిన మహిళల మరణాలు కుటుంబ పరువు ఖాతాలో మిస్టీరియస్ గా మిగిలిపోవాలని మినహాయింపు చట్టంలో ఉందా అని ప్రశ్నించారు.
సిఐ రమణయ్య ను సస్పెండ్ చేయాలి...
మొదటి నుండి కేసు విషయంలో సీఐ రమణయ్య తీరు అనుమానాస్పదంగా ఉందని, అతన్ని సస్పెండ్ చేసి
వేరే అధికారితో సిపి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రోజా మృతికి కారణమైన డాక్టర్ శ్రీధర్ ని అదుపులోకి తీసుకొని, తర్వాత దర్యాప్తు ప్రారంభించాలని మహిళ చేతన తరపున ఆమె డిమాండ్ చేశారు. హెచ్ఆర్ఎఫ్ ప్రతినిధి అనురాధ మాట్లాడుతూ బెంగళూరులో కూడా రెండు రోజుల క్రితం ఇలాంటి సంఘటన జరిగిందని, ఒక హిజ్రాన్ని అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి, ఒక కెనాల్ లో తోసేసారని తెలిపారు. ఆ కేసును కూడా పోలీసులు ఇలాగే చేశారని, మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో నిందితులను అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. రాజకీయ ఇతర ప్రలోభాలకు పోలీసులు గురికాకుండా, కేసుల పట్ల నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆమె సూచించారు. సమావేశంలో భారత నాస్తికి సమాజం జిల్లా కార్యదర్శి వై నూకరాజు, సత్యవతి, నాగమణి, మంగవేణి, లావణ్య పాల్గొన్నారు.